దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'తలైవి'. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఎమ్జీఆర్ పాత్రలో అరవింద్ స్వామిగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కంగనా రనౌత్ శనివారం విడుదల చేసింది. తన ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ అదిరిపోయింది. ముదురు ఆచుపచ్చ రంగు కేప్ ధరించి ఉన్న కంగనా భారీ కటౌట్.. 'అమ్మ'ను తలపించేలా ఉంది.
'అమ్మ'గా మారడానికి కంగనా పడిన కష్టం ఫస్ట్‌లుక్‌లో తెలుస్తోంది. జయ పాత్ర కోసం అమెరికాలో మేకప్ టెస్ట్ చేయించుకున్న ఆమె భరతనాట్యంలో శిక్షణ కూడా పొందారు. జయలలితలా తెరమీద కనిపించేందుకు ప్రత్యేకంగా తర్ఫీదు కూడా తీసుకున్నారు. ఇక 'తలైవి' సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సహకారం అందిస్తున్నారు. ఈ సినిమాను విబ్రీ మీడియా పతాకంపై విష్ణు వర్థన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ సంయుక్తంగా తమిళం,తెలుగు, హిందీ మూడు భాషల్లో నిర్మిస్తున్నారు.